వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ గ్రేస్ సెలస్టియన్
సీమాంధ్ర సారధి(డోన్) : కుష్టు(Leprosy) అంటువ్యాధి కాదని, సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని డోన్ (Dhone) ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు గ్రేస్ సెలస్టియన్ పేర్కొన్నారు. ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక లేప్రసీ కాలనీలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజానికి దూరం పెట్టకూడదని, వారిపై వివక్ష చూపకూడదని కోరారు. చాలామందిలో ఉన్న అపోహలను తొలగించి, రోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రోగులకు ఉచి తంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్. కాంపౌండర్ మాణిక్యంశెట్టి, యోగా శిక్షకురాలు సోని ప్రతాప్ పాల్గొన్నారు.

ఎలా వస్తుంది?
కుష్టు వ్యాధి (Leprosy) మైకోబాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) అనే బ్యాక్టీరియా సంక్రమణ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా చర్మం, నరాలు, కళ్ళు, ముక్కు లోపలి భాగం మీద ప్రభావం చూపుతుంది. ఇది వెంటనే అంటుకునే వ్యాధి కాదు. దీర్ఘకాలం పాటు చికిత్స తీసుకోని బాధితులతో సన్నిహితంగా ఉండటం వల్ల వచ్చే అవకాశం ఎక్కువ. శుభ్రత లోపం, పోషకాహార లోపం ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ.
లక్షణాలేంటి?
- చర్మంపై తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కనిపించడం.
- ఆ మచ్చలపై స్పర్శ భావం తగ్గిపోవడం (నొప్పి తెలియకపోవడం).
- చేతులు, కాళ్లలో నరాల బలహీనత.
- వేళ్లు మొద్దుబారినట్లుండం
- గాయాలయినా నొప్పి లేకపోవడం.
- ముఖంలో, చెవుల దగ్గర చర్మం మందంగా మారడం.
మందులతో నయమవుతుందా?
కుష్టు వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి. ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఈ మందులు 6 నెలల నుంచి 12 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, ఉచిత మందులు లభిస్తాయి. సమయానికి చికిత్స తీసుకుంటే కుష్టు వ్యాధి వల్ల వైకల్యం సంభవించకుండా పూర్తిగా నివారించవచ్చు. కుష్టు శాపం కాదు, జన్మతః వచ్చే వ్యాధి కాదు. తొందరగా గుర్తిస్తే పూర్తిగా నయం అవుతుంది.
