ప్రతీకాత్మక చిత్రం
ప్రేమ తిరస్కారం ప్రతీకారంగా మారింది. డాక్టర్‌పై కోపాన్ని ఆయన భార్యపై తీర్చుకోవాలనుకుంది. ప్లాన్ ప్రకారం హెచ్ఐవీ సోకిన రక్తంతో ఇంజెక్షన్ ఇచ్చిన ఈ భయానక ఘటన కర్నూలులో కలకలం రేపింది. చివరకు ఏం జరిగింది..
– సీమాంధ్ర సారధి (క్రైం)
కర్నూలు(Kurnool) డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాల మేరకు .. నగరానికి చెందిన ఓ వసుంధర (34) నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఓ డాక్టర్‌ను ప్రేమించింది. కొన్నేళ్లకు వసుంధరను కాదని, ప్రైవేటు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో వసుంధర తీవ్ర మనస్తాసానికి గురైంది. డాక్టర్ మీద కోపంతో రగిలిపోయింది. ఆ కోపాన్ని ఆయన భార్యపై చూపింది. డాక్టర్ భార్యకు హెచ్.ఐ.వీ సోకిన వ్యక్తి రక్తాన్ని ఎక్కించాలనుకుంది. అలా చేయడం వల్ల భార్యభర్తలు ఎయిడ్స్ బారిన పడతారని ఊహించింది.
పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న డాక్టర్ భార్యను ఆటోతో ఢీ కొట్టించింది. ప్రమాదం జరిగిన వెంటనే వసుంధర అక్కడికి చేరుకుని ఆమెకు సాయం చేస్తున్నట్టు నటించింది. గాయపడ్డ డాక్టర్ భార్యను ఆటోలో ఎక్కించే సమయంలో అప్పటికే వెంట తెచ్చుకున్న హెచ్ఐవి(H.I.V) రక్తంతో లోడ్ చేసిన ఇంజెక్షన్ వేసింది.
హెచ్.ఐ.వి రక్తం ఎలా సేకరించిదంటే..
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే హెచ్ఐవి రోగుల నుంచి ‘రిసెర్చ్’ పేరుతో రక్తాన్ని సేకరించినట్లు విచారణలో తెలిపింది వసుంధర. ఇటు డాక్టర్ భార్యకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. డాక్టర్ ఫిర్యాదు మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన ఆదోనికి చెందిన కొంగె జ్యోతి, మంత్రాలయానికి చెందిన భూమా జశ్వంత్, భూమా శృతిని అదుపులోకి తీసుకున్నారు.
