- కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి
సీమాంధ్ర సారధి (లీగల్): ప్యానల్ న్యాయవాదులు పేదలకు సత్వర న్యాయం అందించాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు శనివారం స్థానిక జిల్లా కోర్టులోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో ప్యానల్ న్యాయవాదులు, ప్యారా లీగల్ వలంటీర్లకు విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ హాజరయ్యారు. జిల్లా జడ్జి కబర్థి మాట్లాడుతూ ప్యానల్ న్యాయవాదులు పేదలకు ఉచితంగా కేసులు వాదిస్తారని చెప్పారు. లీగల్ ఎయిడ్ క్లినిక్‌లకు వచ్చిన బాధితులకు తగిన సలహాలు ఇవ్వాలని, ప్యానల్ న్యాయవాదులు ప్రవర్తన నియమావళి పాటిస్తూ బాధితుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.

అనంతరం కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ప్యారా లీగల్ వలంటీర్లు సమాజంలోని సామాన్య ప్రజలకు, న్యాయ సేవ సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరించాలని కోరారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ ప్యారా లీగల్ వలంటీర్స్ పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవడంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భూవివాదాలు, కుటుంబ వివాదాలు సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, న్యాయ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు ప్యార లీగల్ వలంటీర్లుగా న్యాయ సేవ అధికార సంస్థలో పనిచేయవచ్చని తెలిపారు.
