- జంతు కొవ్వు కలిపారన్న దానికి ఆధారాలు లేవని సుప్రీంకు నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ..
సీమాంధ్ర సారధి (కర్నూలు): తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారాలను ఖండిస్తూ.. పాలకులకు సద్బుద్ధి ప్రసాదించాలని వైసీపీ నాయకులు ఆలయంలో పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ శుక్రవారం కల్లూరు అర్బన్ కృష్ణానగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం కూటమి నేతల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘నీచానికి దిగజారారు’’
‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవమయిన ఏడుకొండల వెంకన్న స్వామి లడ్డూ (Laddu) ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ విచారణలో తేలిపోయింది. కూటమి నేతల అసత్య ప్రచారం బట్టబయలైంది.’’ – కాటసాని రాంభూపాల్ రెడ్డి

‘‘పాణ్యంలో అవినీతి రాజ్యం..’’
నంద్యాల జిల్లాలో ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు గ్రావెల్, మద్యం అమ్మకాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని కాటసాని ఆరోపించారు. చివరికి అధికారుల బదిలీల్లో కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘‘తనపై కబ్జా ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. చేతనయితే ఎంక్వయిరీ చేసి వాస్తవాలు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారా సుధీర్, కోడుమూరు సమన్వయకర్త ఆదిమూలపు సతీష్, కల్లూరు అర్బన్ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంతకు కేసేమిటి?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదంపై 2024 సెప్టెంబర్‌లో వివాదం మొదలైంది. ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా భావించే స్వామి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చాయి. వివాద తీవ్రతను గమనించిన సుప్రీంకోర్టు..ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు అవసరమని భావించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ తాజాగా తుది నివేదికను దాఖలు చేసింది. లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారన్న ఆరోపణలకు ఆధారాలు లేవని సీబీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
