- 52వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి
సీమాంధ్ర సారధి(కర్నూలు) జనవరి 31: ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలుచేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శనివారం కర్నూలు నగరం 52వ వార్డు పరిధిలోని కొండారెడ్డి బురుజు నుంచి సాయిబాబా ఆలయం వరకు సుమారు 15 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను పంపిణీ చేశారు.
ఆత్మీయ పలకరింపు..
మంత్రి భరత్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను విచారించారు. మాల శ్రీనివాసులు, చిన్న ఖాసీంలకు దివ్యాంగ పింఛన్లను, మీనాక్షి, నాగమణికి వితంతు పెన్షన్లను, కొంతమందికి వృద్ధాప్య, ఒంటరి మహిళా పింఛన్లను అందజేశారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మంత్రి అడిగిన ప్రశ్నకు.. ” ఒకటో తారీకునే పింఛన్ అందుతోందని, పంపిణీలో ఎలాంటి సమస్యలేదని” లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో కర్నూలు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సచివాలయ సిబ్బంది ల్గొన్నారు.
19వ వార్డులో..
కల్లూరు అర్బన్ పరిధిలోని 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ నాయకులు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్లూరు అర్బన్-2 బీజేపీ ప్రధాన కార్యదర్శి ఉలిందకొండ రవి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కట్టుబడి రఘునాథ్, సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) స్రవంతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

