సీమాంధ్ర సారధి, కర్నూలు, మార్చి 25: ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా హార్మోజ్ జలసంధి గుండా జరిగే ఇంధన సరఫరాకు కొంత అంతరాయం ఏర్పడింది. ఫలితంగా భారత్కు రావాల్సినంత ఇంధనం, గ్యాస్ రావడం లేదు. ఇటు కేంద్రం వంట గ్యాస్ ధరలను పెంచేసింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ కొరత లేకుండా చూడడంతో పాటు పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని ఆహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎస్ ఉజేర్ అహ్మద్, ఏ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో ప్రదర్శన నిర్వహించి అనంతరం అంబేద్కర్ కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత కారణంగా ప్రైవేట్ హాస్టళ్లు, చిన్న చిన్న హోటల్లో మూతపడ్డాయని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కే రామకృష్ణ, ఎంఎ సర్దార్, టీ పురుషోత్తం రెడ్డి, చిత్తారి వెంకటర వర్మ, ఎండీ యూనూస్, ఎస్ రమణ గౌడ్, ఎస్ అన్వర్ బాషా, కే శ్రీనివాసులు, బి రాజు, ఎం నారాయణ, వై రామాంజనేయులు పాల్గొన్నారు.
