సీమాంధ్రసారధి ప్రతినిధి: దాన ధర్మ ట్రస్ట్, వేద సంకల్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్‌లో గ్రామీణ చిన్నారుల కోసం ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సరస్వతి దేవి, గణనాథుడికి పూజలు అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సాంబశివ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పిల్లలు, వారి తల్లిదండ్రులకు స్వామివారి ప్రసాదం అందజేశారు. అక్షరాభ్యాసం చేసిన ప్రతి చిన్నారికి పలకలు, బలపాలు, నోట్‌బుక్స్, రైటింగ్ ప్యాడ్స్, పెన్నులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణలోని మరుమూల గ్రామాల్లో కూడా నిర్వహించాలని కోరారు. మద్దునూర్ గ్రామంలో ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వేద సంకల్ప సేవా ట్రస్ట్, దాన ధర్మ ట్రస్ట్ సభ్యులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
