సీమాంధ్రసారధి(నంద్యాల): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ ‘‘క్షీర సాగరమథనం’’ వృత్తాంతాన్ని శంఖు మీద చిత్రీకరించారు.
క్షీరసాగర మథనం గురించి క్లుప్తంగా..
హిందూ పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు బలవంతులు కావడంతో దేవతలు ఓడిపోతున్నారు. అప్పుడు అమృతం తాగితే మళ్లీ బలశాలీలు అవుతామని దేవతలు భావించారు. అమృతం క్షీరసాగరంలో ఉందని తెలుసుకుని, దాన్ని పొందేందుకు అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మధించారు. ఆ సమయంలో లోకాలకు నాశనం చేసే హాలాహల(విషం) బయటకు వచ్చింది. అప్పుడు శివుడు దాన్ని సేవించి సమస్త లోకాలను రక్షించాడు. ఆ విషం కారణంగా పరమేశ్వరుడి గొంతు నీలం రంగులో మారింది. అందుకే ఆయనను నీలకంఠుడిగా పిలుస్తారు. చివరికి ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన అసురులు అమృతం కోసం దేవతలతో తగాదా పడ్డారు. అప్పుడు దేవతలకు సాయం చేసేందుకు శ్రీమహావిష్ణువు “మోహిని” అవతారమెత్తాడు. మోహిని చాలా అందంగా ఉండడంతో అసురులు ఆమె మాట విని, అమృతాన్ని పంచే బాధ్యత ఆమెకే అప్పగించారు. అప్పుడు మోహిని అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు చాకచక్యంగా అమృతాన్ని దేవతలకే ఇచ్చారు. అసురులకు ఇవ్వలేదు. ఇలా అమృతాన్ని తాగి దేవతలు అమరత్వం పొందారు.
మహాశివరాత్రి శుభాకాంక్షలు..
‘‘శంఖుపై అర్ధనారీశ్వరుడు, పార్వతీ పరమేశ్వర వివాహం, క్షీరసాగర మథనం వృత్తాంతాన్ని చిత్రాల రూపంలో వివరించాలనుకున్నా. అందుకు చిన్నపాటి శంఖును ఎన్నుకున్నా. మైక్రోబ్రష్లను వాడి ఆక్రాలిక్ పెయింటింగ్స్‌తో చక్కటి సూక్ష్మ చిత్రాలను గీయడానికి నాకు 5 గంటల సమయం పట్టింది.’’ అని చెప్పారు కోటేష్. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
