జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామంలోని పురాతన ఎర్రమ్మ తల్లి దేవాలయంలో ధన ధర్మ ట్రస్ట్ (Dhana Dharma Trust), వేద సంకల్ప సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల అధ్యక్షుడు దుమ్మెన ప్రశాంత్ సహకారంతో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మహా గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, వరలక్ష్మీ వ్రతం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం మహిళలకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వ్రతంలో పాల్గొన్న ప్రతి మహిళకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు.

పంట పొలాల మధ్య ఉన్న పురాతన ఎర్రమ్మ తల్లి దేవాలయంలో గతంలో సక్రమంగా పూజా కార్యక్రమాలు జరిగేవి కావు. అయితే ధన ధర్మ ట్రస్ట్, వేద సంకల్ప సేవా ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు పూనుకుంది. అందులో భాగంగానే అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వత్రం నిర్వహించింది. ఈ కార్యక్రమ నిర్వహణపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. దుమ్మెన ప్రశాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

