ఎమ్మిగనూరు, సీమాంధ్ర సారధి: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూ తిరుగుతున్నాయి. భక్తులు పవిత్రంగా భావించే స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అయితే దర్యాప్తులో అలాంటిదేమి లేదని రిపోర్టు రావడంతో వైసీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయంపై ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రాజకీయ ప్రయోజనాలకు తిరుమల లడ్డూను వాడుకోవడం అత్యంత దురదృష్టకరం. కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరపాలని మా ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్చ నుంచి తప్పించుకుంటుంది. నిజంగా హిందూ ధర్మంపై శ్రద్ధ ఉంటే, పూర్తి స్థాయి న్యాయ విచారణకు ఆదేశించమనండి.
భక్తుల విశ్వాసానికి భంగం కలిగించేలా వ్యవహరించడం సరికాదు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోకుండా మాటలు మార్చడం బాధాకరరం. ప్రజల ముందు ఒకలా, అసెంబ్లీలో మరోలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు,’’ అని అన్నారు.
కొత్త ఫించన్లేవి?
‘‘పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలపై స్పష్టత లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. కొత్త పింఛన్ల ఊసేలేదు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని ప్రభుత్వం మౌనంగా ఉండడం బాధాకరం. కేవలం ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వ ఖాజానాను దుర్వినియోగం చేస్తున్నారు, ’’ అని విమర్శించారు.
ఇంతకు కేసేమిటి?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదంపై 2024 సెప్టెంబర్లో వివాదం మొదలైంది. ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా భావించే స్వామి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చాయి. వివాద తీవ్రతను గమనించిన సుప్రీంకోర్టు..ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు అవసరమని భావించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ తాజాగా తుది నివేదికను దాఖలు చేసింది. లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారన్న ఆరోపణలకు ఆధారాలు లేవని సీబీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
