దీక్ష చేస్తున్న అంగన్వాడీలు
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు జీతాల పెంపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. మంగళవారం అంగన్వాడీలు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నిధుల సమీకరణ పేరుతో అంగన్వాడీలను మభ్యపెడుతున్నారని, కనీస వేతనం ఇవ్వడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. గతంలో అంగన్వాడీల 42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 26 వేలు ప్రకటించకపోతే మార్చి 2న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23 నుంచి 26 వరకు రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గోవిందు, రాముడు, సురేష్, రవి, శ్రీను, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు భాగ్యమ్మ నాగలక్ష్మి, నాగ శిరోమణి, సునీతమ్మ, హుస్సేనమ్మ, రామేశ్వరమ్మ, రేణుక, రాధా, హేమలత, సుశీల, రోజామణి పాల్గొన్నారు.
