దారిలో పేరుకుపోయిన చెత్తను చూపుతున్న కాలనీవాసులు
సీమాంధ్ర సారధి, కర్నూలు, ఫిబ్రవరి 24: కర్నూలు నగరం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీకి సమీపంలోని రామ్‌నగర్‌లో మౌలిక వసతులు కొరవడ్డాయి. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
‘గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాం’
కాలనీలో చాలా సమస్యలున్నాయని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని కాలనీవాసులంటున్నారు.
‘దారి గుంతలమయం కావడంతో ఆటోలు కూడా కాలనీలోకి రావడం లేదు. పనులకు వెళ్లే కూలీలు, ఉద్యోగులు, స్కూలుకు వెళ్లే పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక వర్షం కురిస్తే దారి చిత్తడిగా మారుపోతుంది. రాత్రి సమయాల్లో జారిపడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. కనీసం గ్రావెల్ రోడ్డు అయినా వేయాలని గతంలో చాలాసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. కాలనీలో మంచినీటి సౌకర్యంతో పాటు పారిశుధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలి.‘ అని కాలనీ అసోసియేషన్ ప్రతినిధి కే చంద్రశేఖర్ కే, మహానంది, వ్యాపారవేత ఏ కరుణాకర్ చౌదరి, పాస్టర్ ఫిలిప్, డీవైఎఫ్ఐ నాయకుడు సీహెచ్ శోభన బాబు కోరుతున్నారు.

‘సమస్యలను వెంటనే పరిష్కరించాలి’
‘అవసరం లేని చోట్ల రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ స్పందించి కనీసం రామ్‌నగర్‌లో మొరుసు రోడ్డయినా వేయాలి. కాలనీ వాసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి’ అని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇ. పుల్లారెడ్డి డిమాండ్ చేశారు.
