వ్యాస మహర్షి చిత్రాన్ని గీస్తున్న కోటేష్
- డివైన్ ఆర్ట్ క్యాంప్‌లో పాల్గొన్న ఏపీ, తెలంగాణ చిత్రకారులు
సీమాంధ్ర సారధి, నంద్యాల: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో బుధవారం (25వ తేదీ) చిత్రకళ ప్రదర్శన నిర్వహించారు. చింతమనేని గోపి కుటుంబ సభ్యుల సహకారంతో ప్రముఖ చిత్రకారులు, శిల్పి శేష బ్రహ్మం ఆధ్వర్యంలో ‘‘డివైన్ ఆర్ట్ క్యాంప్’’ పేరున ఏర్పాటుచేసిన ఈ చిత్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన 22 మంది ప్రముఖ చిత్రకారులు రామాయణం, భారతం, భాగవతంలో పాత్రల చిత్రాలను గీశారు.

ఆది గురువు వ్యాస మహర్షి: కోటేష్
‘‘నేను వేద వ్యాస మహర్షి చిత్రాన్ని ఆయిల్ కలర్స్‌తో, కాన్వాస్‌పై వేసాను. మహా భారతం, భాగవతాన్ని రచించిన ఆది గురువు ఆయన. వేదాలను నాలుగు భాగాలుగా (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం) విభజించిన వ్యాస మహర్శిది మహాభారతంలో ప్రముఖ పాత్ర. దృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జననానికి కారకుడు. కౌరవులు, పాండవులకు తాత. తన వేద పరిజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించిన మహనీయుడు. అందుకే ఆయన గురువులకు గురువు ఆది గురువు. అందుకే ఆయన చిత్రం గీయాలని ఎన్నుకున్నా. వేలాది కళాభిమానులు నేను గీసిన చిత్రాన్ని చూసి ప్రశంసించారు. తోటి చిత్ర కళాకారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. చింతమనేని హనుమంతరావు, ప్రముఖ చిత్రకారులు శేష బ్రహ్మం నాకు రూ. 10వేల నగదు, స్వామి ప్రసాదం అందజేశారు,’’ అని వివరించారు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న కోటేష్.

ఈ సందర్భంగా నంద్యాల చిత్రకారులు రామ్ ప్రసాద్, రాముడు, వాసు ఆర్ట్, సుంకన్న, ఓబులేసు కూడా కోటేష్(Kotesh)కు అభినందనలు తెలిపారు.
