కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్న నాగేంద్రుడు
సీమాంధ్ర సారధి, కర్నూలు: కల్లూరు గ్రామ పరిధిలోని పందిపాడు ఇందిరమ్మ కాలనీవాసులు చాలా ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిని సామాజిక కార్యకర్త నాగేంద్రుడు, రాము, కాలనీవాసులు సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ సిరి దృష్టికి తీసుకెళ్లారు. నిధులు మంజూరైనా అధికారులు పనులు మొదలుపెట్టలేదని ఫిర్యాదు చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇంతకీ కాలనీలో ఉన్న సమస్యలేంటో చూద్దాం..
అంబులెన్స్ రాలేని రహదారి..
రహదారి బాగోలేదు. గుంతలు తేలిన దారిలో ఉద్యోగులు, కూలీలు, విద్యార్థుల రాకపోకలు ప్రమాదకరంగా మారింది. అత్యవసర వేళ అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి. మూడు నెలల క్రితమే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా, అధికారులు మాత్రం పనులు మొదలుపెట్టలేదు.
వేసవికి ముందే వేదన:
కాలనీలో తీవ్ర తాగునీటి కొరత ఉంది. మూడు కిలోమీటర్ల దూరం వెళ్తేగాని బిందెనీళ్లు దొరకని దుస్థితి. వేసవి సమీపిస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో సమస్య తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది.
చీకట్లో పాముల భయం..
కాలనీలో వీధి దీపాలు లేవు. రాత్రివేళ ఎటుచూసినా అంధకారమే. చీకట్లో కీటకాలు, పాములు, తేళ్ల సంచారానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలకు అధికారులు స్పందిస్తారా? సమస్యల పరిష్కారానికి కదులుతారో లేదో చూడాలి.
