సీమాంధ్ర ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలో సంతోష్ నగర్ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా వీధి లైట్లు లేకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎన్ నవీన్ కుమార్ రాత్రివేళ రోడ్డు వెంట కొంతదూరం నడిచారు. ప్రజా ప్రతినిధులు తక్షణం జోక్యం చేసుకుని వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు.

అధికారులకు పట్టడం లేదు..
‘‘హైవే రోడ్ వేసి దాదాపు 20 ఏళ్లయ్యింది. అయితే సంతోష్ నగర్ నుంచి మొదలుకొని పంచలింగాల జంక్షన్ వరకు రోడ్డుకు ఇరువైపులా లైట్లు ఏర్పాటు చేయలేదు. కార్మికులు, ఉద్యోగులు పనులు ముగించుకుని ఈ రోడ్డు వెంట వెళ్తుంటారు. వీధిలైట్లు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు స్పందించి సర్వీస్ రోడ్లు వేయాలి. వీధిలైట్లు ఏర్పాటు చేయాలి.’’
– కాలనీవాసులు ఎండీ యునూస్, కే రాముడు, ఏ ఆంజనేయులు గౌడ్.
