సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు: తక్షణమే పీఆర్సీ అమలు చేసి, వేతనాలు పెంచాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు శనివారం ధర్నా చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు బి కేసన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బి రాముడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే వైసీపీ సర్కారును గద్దె దింపారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని, 50% పీఆర్సీ ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలపై స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ నీరజకు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బి ఈరన్న, మల్లికార్జున, కే రామంజి, దేవదాస్ విక్రమ్, రవి, ఉరుకుందు, సీఐటీయూ నాయకులు బి.గోపాల్ పాల్గొన్నారు
