జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న జడ్జి లీలా వెంకట శేషాద్రి
సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, మార్చి 3: బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు. మంగళవారం (మార్చి 3వ తేదీ) స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహ విముక్తి భారత్ ప్రచార రధాన్ని న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రధం జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో పర్యటించి, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించనుంది. తమ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతుందని తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, లేదా లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ నిర్మూలన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్ రాయపాటి శ్రీనివాసులు, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక, న్యాయవాది బాలాజీ పాల్గొన్నారు.

