కార్యక్రమంలో ప్రసంగిస్తున్న విజయ గౌరి
- అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సావిత్రీబాయి పూలేకు ఘన నివాళి
సీమాంధ్ర సారధి, కర్నూలు, మార్చి 10: మహిళల సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని స్త్రీ శిశు సంరక్షణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ గౌరీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలోని ఎంపీపీ హాల్లో మహిళా సంఘం, సీఐటీయూ, 5వ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విజయ గౌరీ మాట్లాడుతూ.. ఆడపిల్ల అని తెలియగానే గర్భస్థ శిశువును విచ్ఛిన్నం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. అలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ‘భేటీ పడావో బేటీ బచావో’ నినాద స్ఫూర్తితో ఆడపిల్లలను బాగా చదివించాలని కోరారు. గుడ్, బ్యాడ్ టచ్ గురించి ఆడపిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పాల్సిన బాధ్యత కన్నవారిపై ఉందన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు సాయం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలోని స్టాఫ్ సెంటర్లను సంప్రదించాలని, ఉమెన్ హెల్ప్ లైన్ కోసం 181 నంబరుకు డయల్ చేయాలని చెప్పారు.

ఇంటీరియర్ డిజైనర్ ఎన్జీవో రుజుత మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో బతికే ధైర్యం పిల్లలకు అలవర్చాలని సూచించారు. ప్రతి మహిళ తమ అభిరుచికి అనుగుణంగా స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తీసుకుని ఆత్మస్థైర్యంతో జీవించాలని కోరారు. ఐద్వా రాష్ట్ర కమిటీ నాయకురాలు ఎన్ .అలివేలు మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలకు కారణమైన గంజాయి, డ్రగ్స్ నివారణకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాధాన్యత గురించి వివరించారు. దేశంలో రాజ్యాంగ హక్కులు రక్షణ కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో అలమటిస్తున్న వారిలో భారతదేశం 145 వ స్థానంలో ఉందన్నారు. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని కోరారు. సావిత్రిబాయి పూలే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తుచేస్తూ.. స్త్రీలకు విద్య నేర్పడంకోసం ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ యూనియన్ కోశాధికారి రేణుక మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపితే పోషకాహారంతో పాటు అక్షర జ్ఞానం వస్తుందన్నారు. అనంతరం అతిథులకు శాలువ కప్పి సత్కరించారు.

పట్టణ ఐక్య సంఘం కార్యదర్శి కిరణ్మయి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బాలదుర్గమ్మ, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి సుజాత, పద్మ, పట్టణ ఐక్య సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మి, ఆర్పీల సంఘం నాయకురాలు లక్ష్మి, నగర అధ్యక్షురాలు కుమారి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
