- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జడ్జి కమలాదేవి
సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్: కర్నూలు నగరంలోని స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొదట అదనపు జిల్లా న్యాయమూర్తి పి.కమలాదేవి, 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మి రాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, మొబైల్ కోర్ట్ జడ్జి అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి పి.కమలాదేవి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తే దేశం పురోగతి సాధిస్తుందన్నారు.

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు వంద రోజుల ‘బాల్య వివాహ రహిత భారత్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త సహకారంతో జిల్లాలోని 160 గ్రామాలలో సదస్సులు నిర్వహించి బాల్య వివాహల వల్ల జరిగే అనర్థాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. బి.అగ్రహారం, సంతె కుడ్లూరు, లింగంపల్లి గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం జడ్జీలు కమలాదేవి, లక్ష్మి రాజ్యం, శోభారాణి, సరోజనమ్మ, అనూషను లీగల్ సర్వీసెస్ సిబ్బంది శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నిర్మల, లక్ష్మి, ఇందుమతి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక, ఎన్జీవో డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, మహిళా ప్యానెల్ నాయవాదులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులు, కోర్టుల మహిళ సిబ్బంది, ప్యారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు.

